తొలిసారి ఫైన‌ల్ చేరిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌

Delhi Capitals qualify for first-ever final. ఎట్ట‌కేల‌కు ఢిల్లీ క్యాపిట‌‌ల్స్‌ నిరీక్ష‌ణ ఫ‌లిచింది.

By Medi Samrat  Published on  9 Nov 2020 8:38 AM GMT
తొలిసారి ఫైన‌ల్ చేరిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌

ఎట్ట‌కేల‌కు ఢిల్లీ క్యాపిట‌‌ల్స్‌ నిరీక్ష‌ణ ఫ‌లిచింది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌రువాత తొలిసారి ఢిల్లీ ఫైన‌ల్ చేరింది. ఆదివారం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ను 17 ప‌రుగుల‌తో చిత్తు చేసి తుది పోరుకు అర్హ‌త సాధించింది. ఫైన‌ల్‌లో ఢిపెండింగ్ చాంఫియ‌న్ ముంబై ఇండియ‌న్స్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ద‌మైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (50 బంతుల్లో 78; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' స్టొయినిస్‌ (27 బంతుల్లో 38; 3 ఫోర్లు, సిక్స్‌), హెట్‌మైర్‌ (22 బంతుల్లో 42 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడారు. తర్వాత లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులే చేసి ఓడింది. కేన్‌ విలియమ్సన్‌ (45 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) పరువు నిలిపే పోరాటం చేశాడు. స్టొయినిస్‌ (3/26), రబడ (4/29) హైదరాబాద్‌ను దెబ్బ తీశారు.

టాస్ గెలిచిని ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్య‌ర్ మ‌రో ఆలోచ‌న లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. స్టొయినిస్‌, శివ‌ర్ ధావ‌ర్ తొలి వికెట్‌కు 86 ప‌రుగులు జోడించారు. 3 ప‌రుగుల వ‌ద్ద స్టొయినిస్‌కు లైఫ్ పొందాడు. ఆ త‌రువాత అత‌డు చెల‌రేగి ఆడాడు. అత‌డికి తోడుగా ధావ‌న్ కూడా మెర‌వ‌డంతో ప‌వ‌ర్‌ప్లేలో ఢిల్లీ 65 ప‌రుగులు సాధించింది. ర‌షీద్ ఖాన్.. స్టొయినిస్‌ను బోల్తా కొట్టించ‌గా.. అనంత‌రం వ‌చ్చిన శ్రేయాస్ అయ్య‌ర్ (21; 20 బంతుల్లో 1 ఫోర్‌) క‌లిసి ధావ‌న్ స్కోర్ బోర్డును ప‌రిగెత్తించాడు. ఈ క్ర‌మంలో గ‌బ్బ‌ర్ 26 బంతుల్లో అర్థ‌శ‌త‌కం అందుకున్నాడు. స్కోర్ వేగం పెంచే క్ర‌మంలో శ్రేయాస్ ఔటైనా... క్రీజులోకి వ‌చ్చిన హెట్‌మైయిర్ (42 నాటౌట్ ; 22 బంతుల్లో 4పోర్‌, సిక్స్) ఎడాపెడా బౌండ‌రీలు బాదుతూ.. ప‌రుగులు రాబ‌ట్టాడు. చివ‌రి రెండు ఓవ‌ర్లో హైద‌రాబాద్ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బంతులు వేయ‌డంతో.. 13 ప‌రుగులు మాత్ర‌మే వ‌చ్చాయి. హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో సందీప్‌, ర‌షీద్‌, హోల్డ‌ర్ త‌లో వికెట్ తీశారు.

విలియ‌మ్ స‌న్ పోరాటం..

190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స‌న్‌రైజ‌ర్స్‌కు శుభారంభం ద‌క్క‌లేదు. కెప్టెన్ వార్న‌ర్ (2) ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేరాడు. దీంతో ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దే బాధ్య‌త‌ను ప్రియమ్‌ గార్గ్‌ (17; 2 సిక్స్‌లు), మనీశ్‌ పాండే (14 బంతుల్లో 21; 3 ఫోర్లు)లు తీసుకున్నారు. అయితే స్టొయినిస్ ఒకే ఓవ‌ర్‌లో ఇద్ద‌రిని ఔట్ చేసి హైద‌రాబాద్‌ను గ‌ట్టి దెబ్బ‌కొట్టాడు. ఈ ద‌శలో సీనియ‌ర్ ఆట‌గాడు విలియ‌మ్ స‌న్, హోల్ట‌ర్ కాసేపు వికెట్ల ప‌త‌నాన్ని అడ్డుకున్నారు. ఇక క్రీజులో కుదురుకున్నాక విలియ‌మ్ స‌న్ చెల‌రేగి పోయాడు. హోల్డ‌ర్ ఔటైనా కూడా.. విలియ‌మ్ స‌న్ ధాటిగా బ్యాటింగ్ చేస్తూ ర‌న్‌రేట్‌ను అదుపులో ఉంచాడు. అబ్దుల్‌ సమద్‌ (16 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు. దీంతో స‌న్‌రైజ‌ర్స్ విజ‌యం దిశ‌గా సాగింది. ఈ ద‌శ‌లో మ‌రోసారి బంతి అందుకున్న స్టొయినిస్ విలియ‌మ్ స‌న్ ను పెవిలియ‌న్ చేర్చగా.. రబడ ఒకే ఓవర్లో సమద్, రషీద్‌ ఖాన్(11), శ్రీవ‌త్స్ గోస్వామి(0) ‌లను పెవిలియన్‌ చేర్చాడు. దీంతో హైద‌ర‌బాద్ ఓట‌మి ఖాయ‌మైంది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ర‌బాడ నాలుగు, స్టొయినిస్ మూడు, అక్ష‌ర్ ప‌టేల్ ఒక్క వికెట్ ప‌డ‌గొట్టారు.

Next Story