Video : ఆ కుర్రాడి క్యాచ్‌కు జాంటీ రోడ్స్‌ చేతులు జోడించి న‌మ‌స్క‌రించాడు..!

జాంటీ రోడ్స్.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియ‌ని వ్య‌క్తి ఉండ‌రు. అతని క్యాచ్‌లు, ఫీల్డింగ్ వీడియోలు నేటికీ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతూనే ఉంటాయి

By Medi Samrat  Published on  7 May 2024 8:21 AM GMT
Video : ఆ కుర్రాడి క్యాచ్‌కు జాంటీ రోడ్స్‌ చేతులు జోడించి న‌మ‌స్క‌రించాడు..!

జాంటీ రోడ్స్.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియ‌ని వ్య‌క్తి ఉండ‌రు. అతని క్యాచ్‌లు, ఫీల్డింగ్ వీడియోలు నేటికీ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతూనే ఉంటాయి. జాంటీ రోడ్స్ తన ఫీల్డింగ్‌తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన మొదటి ఆటగాడు. అటువంటి ఆటగాడు ఒకరిని, అది కూడా బాల్ బాయ్‌ని పొగిడితే ఖచ్చితంగా ఏదో జ‌రిగి ఉంటుంది. ఆదివారం లక్నో సూపర్‌జెయింట్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ అలాంటిదే జరిగింది.

ఈ మ్యాచ్‌లో బాల్ బాయ్ క్యాచ్‌ని పట్టడంతో జాంటీ రోడ్స్ కూడా చప్పట్లు కొట్టాల్సి వచ్చింది. ఇది మాత్రమే కాదు, జాంటీ రోడ్స్ ఈ పిల్లవాడి ఫీల్డింగ్ టెక్నిక్‌ను ఎంతగానో మెచ్చుకున్నాడు. ఆయ‌న‌ మ్యాచ్ ముగిసిన తర్వాత పిల్లవాడిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు. అతడు మాట్లాడటం ముగించగానే.. పిల్లవాడి ముందు చేతులు లేపి న‌మ‌స్క‌రించాడు.

కోల్‌కతా నిర్దేశించిన 236 పరుగుల లక్ష్యాన్ని లక్నో జట్టు ఛేదించే క్ర‌మంలో బ్యాట్స్‌మెన్ మార్కస్ స్టోయినిస్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అతనికి వైభవ్ అరోరా బౌలింగ్ చేస్తున్నాడు. వైభవ్ వేసిన బంతిని స్టోయినిస్ అప్పర్ కట్ ఆడగా.. బంతి థర్డ్ మ్యాన్ ఏరియా వైపు వెళ్లింది. అక్కడ ఫీల్డర్ ఎవరూ లేకపోవడంతో బంతి నేరుగా బౌండరీ లైన్ దాటింది. ఇది సిక్స్. ఇంత‌లో ఆ ప్రాంతంలో ఉన్న‌ ఓ బాల్ బాయ్ పరిగెత్తుకుంటూ వ‌చ్చి బంతిని పట్టుకున్నాడు. అది చూసిన లక్నో ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ తనను తాను ఆపుకోలేకపోయాడు.. ఈ క్యాచ్‌ను ప్రశంసిస్తూ చప్పట్లు కొట్టడం ప్రారంభించాడు. దీన్ని టీవీలో చూసిన బాల్ బాయ్ చాలా సంతోషించాడు. ఈ సమయంలో ఇరువురి స్పందన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మ్యాచ్ ముగిసిన తర్వాత జాంటీ రోడ్స్ పిల్లవాడిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు. ఈ సమయంలో జాంటీ రోడ్స్ ఈ పిల్లవాడి ఫీల్డింగ్ టెక్నిక్‌ను మెచ్చుకుంటూ.. "మేము T20ల‌లో క్యాచింగ్ చేసేట‌ప్పుడు చేతుల స్థానంపై ఎక్కువ శ్రద్ధ చూపుతాము. దీనితో పాటు పాదాల స్థానం కూడా చాలా ముఖ్యమైనది. నీవు ఎటువంటి త‌డ‌బాటు లేకుండా మంచి క్యాచ్ ప‌ట్టావు అని ఆ పిల్లాడిని ప్ర‌శంసించి చేతులు జోడించి న‌మ‌స్క‌రించి వెళ్లిపోయాడు. ఈ వీడియోను ఐపీఎల్ తన అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేసింది.

ఈ పిల్లాడు జాంటీ రోడ్స్‌ను కలవడం ఇదే మొదటిసారి కాదు. తాను ఇంతకు ముందు జాంటీ రోడ్స్‌ని కలిశానని.. అతనికి తాను పెద్ద అభిమానిని అని ఈ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ మ్యాచ్‌లో లక్నో 98 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.

Next Story