అద్భుతంగా ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్ నిర్మాణం: ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్‌ నిర్మాణం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మెట్రో రైలు అధికారులు.

By Srikanth Gundamalla  Published on  28 April 2024 4:09 AM GMT
shamshabad airport, metro corridor, md nvs reddy,

అద్భుతంగా ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్ నిర్మాణం: ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్‌ నిర్మాణం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మెట్రో రైలు అధికారులు. ఈ నిర్మాణం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది అని.. అయినా అందుబాటులో ఉన్న ఇంజినీరింగ్ పరిజ్ఞానంతో వాటిని అధిగమించి అద్భుతమైన రీతిలో ఈ కారిడార్‌ను నిర్మిస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్‌లో సుమారు 14 కి.మీ మార్గాన్ని ఇంజినీరింగ్ అధికారులు సహా ఇతరులతో కలిసి ఎన్వీఎస్‌ రెడ్డి పరశీలించారు.

మెట్రో అధికారులు, ఇంజినీర్లతో కలిసి కారిడార్‌లో నిర్మించే స్టేషన్ల స్థలాలను ఎన్వీఎస్‌ రెడ్డి పరిశీలించారు. ఫ్లై ఓవర్లు ఉన్న చోట చేయాల్సిన మార్పులపై చర్చలు జరిపారు. నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌, చాంద్రాయణగుట్ట మీదుగా విమానాశ్రయం లోపలి వరకు నిర్మిస్తున్న మార్గంలో ఎక్కడెక్కడ స్టేషన్లు నిర్మించాలనే దానిపై చర్చలు జరిపారు. మూసీనది, ఎల్బీనగర్ జంక్షన్, బైరమాల్గూడ-సాగర్‌రింగ్‌రోడ్డు, చాంద్రాయణగుట్ట ఇంటర్‌చేంజ్‌ స్టేషన్‌ నిర్మించే చోట ఎదురవుతున్న సవాళ్లను ఎలా పరిష్కరించాలనే దానిపై ఇంజినీరింగ్ అధికారుల బృందంతో మెట్రో ఎండీ, అధికారులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పలు సూచనలు చేశారు.

నాగోల్‌-ఎయిర్‌పోర్టు మార్గంలో కొత్తగా నాగోల్‌ వద్ద నిర్మించనన్న మెట్రోస్టేషన్‌ను.. ప్రస్తుతం ఉన్న నాగోల్‌ స్టేషన్‌కు దగ్గర ఎడమవైపు నిర్మించాలని ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి చెప్పారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఈ రెండు స్టేషన్లను కాన్‌కోర్‌ లెవల్‌లో కలుపుతూ.. విశాలమైన స్కైవాక్ నిర్మించాలని అధికారులకు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి సూచించారు. మూసీ నది అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని, ఆ నదిపై మెట్రో బ్రిడ్జిని పొడవైన స్పాన్‌తో నిర్మించాలని చెప్పారు. కొత్త మెట్రో స్టేషన్‌ను ఇప్పటికే ఉన్న కారిడార్‌-1లోని ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్‌కు విశాలమైన స్కైవాక్‌తో అనుసంధానం చేయాలని ఇంజీనిర్లకు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి సూచించారు.

Next Story