Fact Check : అమెరికా ఎన్నికల్లో ఓట్ల రిగ్గింగ్ చోటు చేసుకుందంటూ పోస్టులు వైరల్..!

Vote rigging in 2018 Russian elections. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎంతో ఉత్కంఠ రేపిన సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  9 Nov 2020 10:11 AM GMT
Fact Check : అమెరికా ఎన్నికల్లో ఓట్ల రిగ్గింగ్ చోటు చేసుకుందంటూ పోస్టులు వైరల్..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎంతో ఉత్కంఠ రేపిన సంగతి తెలిసిందే..! ట్రంప్ ఈ ఎన్నికల్లో చాలా అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ వస్తున్నాడు. చాలా చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి తమ ప్రతినిధులను కనీసం పంపలేదని ట్రంప్ వర్గం ఆరోపించిన సంగతి తెలిసిందే..! అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా రిగ్గింగ్ జరిగిందంటూ కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. బ్యాలట్ బాక్సుల్లోకి అధికారులే ఓట్లు వేస్తున్న సీసీటీవీ ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అమెరికా ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతోందని పలువురు ఈ పోస్టులు పెడుతూ ఉన్నారు.



"Those who conduct elections are themselves casting fake votes in the US. Obviously, Donald Trump will go to the Supreme Court. This is why the liberal gang is so happy," అంటూ పోస్టులు పెట్టారు. ఎన్నికలను నిర్వహించాల్సిన అధికారులే ఇలా దొంగఓట్లు వేయడం ఏమిటో అంటూ పలువురు పోస్టులు పెట్టారు. ఈ వీడియోను చూసి ట్రంప్ ఖచ్చితంగా సుప్రీమ్ కోర్టుకు వెళ్తాడని అనుకుంటున్నామని పలువురు కామెంట్లు చేశారు.

నిజ నిర్ధారణ:

అమెరికా ఎన్నికల్లో రిగ్గింగ్ చోటు చేసుకుందంటూ వైరల్ అవుతున్న పోస్టులు 'పచ్చి అబద్ధం'.

ఈ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. Guardian News కు సంబంధించిన యూట్యూబ్ వీడియో లభించింది. " Russian election footage appears to show vote rigging" అంటూ రష్యాకు సంబంధించిన వీడియో అని స్పష్టంగా తెలుస్తోంది. రష్యాలో 2018 సంవత్సరంలో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంది. బ్యాలట్ బాక్సుల్లోకి అధికారులే ఓట్లను వేస్తూ సీసీటీవీల్లో దొరికిపోయారు.


AFP News Agency, Global News కూడా ఈ వీడియోను పోస్టు చేశారు. తక్కువ వ్యవధిలోనే అధికారులు ఇలా బ్యాలట్ పేపర్లను లోపలకు వేస్తూ ఉన్నారని కథనాలను వెల్లడించారు.


The Independent, The Sun మీడియా సంస్థలు కూడా ఈ ఘటనకు సంబంధించిన కథనాలను వెల్లడించారు. మాస్కో లోని ల్యూబర్ట్స్కీలో ఈ ఘటన చోటుచేసుకుందని వార్తాపత్రికలు చెప్పుకొచ్చాయి. మాస్కో లోనూ, మాస్కో చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ బ్యాలట్ బాక్సుల్లోకి దొంగ ఓట్లు పడ్డ విషయాన్ని ఎలెక్షన్ కమీషన్ ధృవీకరించిందని కథనాల్లో తెలిపారు. ఆ ప్రాంతాల్లో పడ్డ ఓట్లను పరిగణించకూడదని రష్యా ఎలెక్షన్ కమీషన్ స్పష్టం చేసింది. తిరిగి ఆ ప్రాంతంలో ఓటింగ్ ను నిర్వహించారు.


ఈ రిపోర్టుల ఆధారంగా వైరల్ అవుతున్న వీడియోలు రష్యాలో చోటు చేసుకున్నవి. అమెరికాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ చోటు చేసుకుందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.


Next Story